NTV Telugu Site icon

CM Chandrababu: పింఛన్ల తొలగింపుపై సీఎం కీలక వ్యాఖ్యలు..

Cbn 2

Cbn 2

CM Chandrababu: బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమీక్షలో సామాజిక పింఛన్ల పంపిణీ అంశంపైనా చర్చించారు.. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేక మంది అనర్హులు ఉన్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు.. అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టం అవుతోంది. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టనున్నారు.. అర్హులకు అందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు.. ఇదే సమయంలో అనర్హులకు ఫించన్లు ఇవ్వడం సరికాదని అన్నారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం తేలాలంటే నిర్థిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. అనర్హులను తొలగించేందుకు పూర్తిస్థాయిలో పింఛన్ల తనిఖీ చేపట్టాలన్నారు. పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని కొందరు పింఛన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై అర్హులైనవారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.

Read Also: Bengaluru: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.11.8 కోట్లు మాయం

మరోవైపు.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాహ్మిణ్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ సొసైటీ ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు వివరించగా.. ప్రతి సామాజిక వర్గానికి ఇలా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ సోసైటీ ఏర్పాటు చేసి ఆయా వర్గాలను బలోపేతం చేసేందుకు పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి సామాజికవర్గంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లు తమ వర్గానికి ఎంతో కొంత సాయం చెయ్యాలని చూస్తున్నారని.. ఇలాంటి వారిని ప్రోత్సహించి ఆర్థికంగా ఆయా సామాజికవర్గాల్లో ఉన్న పేదలను పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో త్వరలో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. స్కిల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్, నైతిక విలువలు, నీతిశాస్త్రం, డిజిటల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్ వంటివి ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు అందించనున్నారు. 26 జిల్లాల్లోని 104 బీసీ హాస్టళ్లలో పైలట్ ప్రాజెక్టులుగా దీన్ని అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ సెంటర్లను ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.

Show comments