Site icon NTV Telugu

CM Chandrababu New Helicopter: అధునాతన ఫీచర్లతో సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్‌..

Cm Chandrababu New Helicopt

Cm Chandrababu New Helicopt

CM Chandrababu New Helicopter: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్‌ మారిపోయింది.. కొన్ని రోజుల క్రితం వరకు వాడిన హెలికాప్టర్‌ బాగా పాతది కావడంతో.. ఇప్పుడు అత్యాధునిక ఫీచర్లతో కొత్త హెలికాప్టర్‌ వాడుతున్నారు.. సీఎం చంద్రబాబు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. రెండు వారాలుగా ఇందులోనే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇటీవలి వరకు వాడిన బెల్‌ తయారీ ఛాపర్‌ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్‌బస్‌ హెచ్‌-160 మోడల్‌ హెలికాప్టర్‌కు మారారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు దీన్ని ఎంపిక చేశారు.

Read Also: CM Revanth Reddy: ఖైరతాబాద్ మహా గణపతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..

అయితే, పాత ఛాపర్‌ ఎక్కువ దూరం ప్రయాణానికి పనికొచ్చేది కాదు.. దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏదైనా జిల్లా పర్యటనకు వెళ్లాలంటే ఉండవల్లి నివాసంలోని హెలిప్యాడ్‌ నుంచి ఛాపర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లాల్సిన ప్రాంతానికి సమీపంలోని ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు. అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో, చాలా సమయం ప్రయాణానికే కేటాయించాల్సిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచే నేరుగా హెలికాప్టర్‌లో జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. దీనివల్ల చాలా సమయం ఆదాకానుంది. కొత్త ఛాపర్‌లో పైలట్లు కాకుండా ఆరుగురు ప్రయాణించే వీలుంది. రక్షణపరంగానూ ఎక్కువ సదుపాయాలున్నాయని చెబుతున్నారు. టెక్నాలజీకి చంద్రబాబు పెట్టింది పేరు.. ఇప్పుడు హెలికాప్టర్‌లోనూ అత్యాధునిక సదుపాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది..

Exit mobile version