Site icon NTV Telugu

CM Chandrababu: నంద్యాల ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. బాలిక సంక్షరక్షణ బాధ్యత నాదేనన్న చంద్రబాబు..

Babu

Babu

CM Chandrababu: నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం విషాదంగా మారింది.. అయితే, ఆ కుటుంబంలోని ఓ చిన్నారి హాస్టల్‌ ఉండి చదువుకోవడంతో.. ప్రాణాలు బయటపడినట్టు అయ్యింది.. ఇక, మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘ‌ట‌న‌పై చలించిపోయారు సీఎం చంద్రబాబు.. నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి స‌మ‌యంలో మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్థరాత్రి మట్టి మిద్దె కూలడంతో వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్, ఆయ‌న భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు విడిచిన విషయం విదితమే.

Read Also: UP Video: కారు రూపంలో మృత్యువు.. కుమార్తెతో కలిసి తల్లి ఇంటికి వెళ్తుండగా ఘోరం

ఈ ఘటనలో గురుశేఖర్ తో పాటు భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. అయితే, రెండో కుమార్తె తల్లపురెడ్డి గురు ప్రసన్న(15) ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుకుంటోంది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులతో సహా తోబుట్టువులు చనిపోవడంతో ప్రసన్న అనాథ అయ్యింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ప్రసన్నకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరుపున రూ.10 లక్షల సాయం ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ తల్లపురెడ్డి నాగమ్మ(70) సంరక్షణలో ఉందని అధికారులు వివరించారు. ప్రసన్న పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేయడంతో పాటు.. వృద్ధురాలైన నాగమ్మకు రూ.2 లక్ష సాయం అందించాలని అధికారులను అదేశించారు సీఎం చంద్రబాబు.. జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ధైర్యం చెప్పాలని సూచించారు. చిన్న వయసులో తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన ఆ బాలికకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా నిలుస్తామని అన్నారు సీఎం చంద్రబాబు.. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Exit mobile version