NTV Telugu Site icon

CM Chandrababu: మూడో రోజు కీలక సమావేశాలు.. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ..

Bill Gates Babu

Bill Gates Babu

CM Chandrababu: దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది.. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్‌ను కోరారు సీఎం చంద్రబాబు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడోరోజు బిల్ గేట్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి.. పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని కొరారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్‌ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లు, సామాజిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.

అంతర్జాతీయ ఆవిష్కరణలను స్థానికంగా వినియోగించుకునేలా సాయం అందించాలని కోరారు. బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ను ముఖద్వారంగా చేసుకునేలా సహకరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. చాలా రోజుల తర్వాత బిల్ గేట్స్‌ను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ, ఆవిష్కరణలపై దృష్టిపెట్టడంలో గేట్స్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇన్నోవేషన్‌పై పరస్పరం సహకరించుకోవడానికి గల అవకాశాలను ఇరువురం చర్చించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పురోగతిలో బీఎంజీఎఫ్ భాగస్వామి కావాలని.. ఇందుకోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

ప్రపంచవ్యాప్యంగా వినియోగ వస్తువులు విక్రయించే యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలీవర్. భారత్‌లో హిందుస్థాన్ యూనిలీవర్ పేరుతో విక్రయాలు జరుపుతోంది. భారత్‌లో డిమాండ్‌కు అనుగుణంగా మరింతగా విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే బ్యూటీ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా వుంటుందని విల్లెం ఉజ్జెన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వచ్చే వ్యవసాయ దిగుబడులను హిందుస్థాన్ యూనిలీవర్ వినయోగించుకోవచ్చని… ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ, హోమ్ కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ రాబర్టో బోకాను సమావేశమయ్యారు ముఖ్యమంత్రి..చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అడిగారు.. నాలుగో రోజు దావోస్ పర్యటనలో కొన్ని సంస్థల ప్రతినిధులు తో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు..