Southern Zonal Council Meeting: దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా, సమన్వయంతో ముందుకు సాగితే దేశం మరింత బలపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 31వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్ సమస్యలకే పరిమితం కాకుండా.. దక్షిణ భారతదేశ సమగ్ర అభివృద్ధికి దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించేలా సాగింది. కేంద్రం–రాష్ట్రాలు, రాష్ట్రం–రాష్ట్రాల మధ్య పోటీ, ఘర్షణల కంటే పరస్పర సహకారం, సమన్వయం, విశ్వాసంతోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు పోటీ పడుతూనే.. కొన్ని కీలక రంగాల్లో ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీలో సుమారు 31 శాతం వాటా కలిగి ఉన్నాయని చంద్రబాబు ప్రస్తావించారు. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను బలమైన రవాణా వ్యవస్థతో అనుసంధానించాలని ప్రతిపాదించారు. మెరుగైన కనెక్టివిటీతో సరకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు పెట్టుబడులు, ఉద్యోగాలు, రాష్ట్రాల మధ్య వాణిజ్యం పెరుగుతాయని వివరించారు.
ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్
దక్షిణాది రాష్ట్రాలకు ఉమ్మడి లాజిస్టిక్స్ వ్యవస్థ, డ్రైపోర్టుల నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. అంతర్గత ప్రాంతాలను సముద్ర పోర్టులతో అనుసంధానించడం ద్వారా సరకు రవాణా సమయాన్ని తగ్గించి, ఎగుమతులను పెంచవచ్చన్నారు. దీనివల్ల దక్షిణ భారతదేశం సమీకృత ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక, దక్షిణాది రాష్ట్రాల నీటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని చంద్రబాబు ప్రతిపాదించారు. 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కృష్ణా, పెన్నా నదుల మీదుగా కావేరి బేసిన్‌కు తరలించే అవకాశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నీటి అంశంలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. నీటి పంపకాలపై వివాదాలకు బదులుగా నీటి సమర్థ వినియోగంపై దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యుత్, విద్య, విపత్తుల నిర్వహణలో సహకారం
దక్షిణాది పవర్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో మరింత బలంగా అనుసంధానించాలని చంద్రబాబు కోరారు. ఒక రాష్ట్రంలో విద్యుత్ మిగులు ఉంటే మరో రాష్ట్రంలో ఉన్న అవసరాన్ని తీర్చేలా సమర్థవంతమైన విద్యుత్ మార్పిడి వ్యవస్థ ఉండాలని సూచించారు. అలాగే దక్షిణాది విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తుపాన్లు, వరదలు, కరవు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో పరస్పర సహకారం కోసం ‘మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్
దక్షిణాది దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ క్షేత్రాలు, సముద్రతీరాలు, ప్రకృతి అందాలను అనుసంధానిస్తూ ఉమ్మడి హెరిటేజ్, స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. మొత్తంగా చంద్రబాబు ప్రసంగం కేవలం రాష్ట్ర సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఫిర్యాదుల జాబితాగా కాకుండా.. దక్షిణాది రాష్ట్రాల సమష్టి అభివృద్ధికి పరిష్కారాల అజెండాగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దక్షిణాది, జాతీయ ప్రయోజనాలతో అనుసంధానిస్తూ 2047 లక్ష్యాలను ముందుంచారు. దక్షిణాది రాష్ట్రాలు విడివిడిగా విజయాలు సాధించడంతో పాటు.. కలిసికట్టుగా పనిచేస్తే దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తిగా ఎదగగలవని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

