CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం తన బ్రాండ్‌ను కోల్పోయిందని విమర్శించారు. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం క్రమంగా కోలుకుంటోందని పేర్కొన్నారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులు అధ్వానంగా మారాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం, మరమ్మతులతో పాటు ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నవంబర్‌లో మూడోసారి సీఐఐ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాం
ఒకప్పుడు రాయలసీమను రాళ్ల సీమగా, కరువు ప్రాంతంగా చూసేవారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకానమీ, స్పేస్ సిటీ, ఐదో తరం సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాయలసీమ సెమీకండక్టర్ హబ్‌గా మారనుందని తెలిపారు. సాగునీటి సదుపాయాలను విస్తరించడం ద్వారా రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అక్కడ పండించే పంటలు ప్రపంచ మార్కెట్లకు చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగాల అభివృద్ధితో రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని పేర్కొన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమను అభివృద్ధికి నమూనాగా నిలబెట్టడమే లక్ష్యమని తెలిపారు చంద్రబాబు..
ఉత్తరాంధ్ర, మార్కాపురం ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకంగా నిలుస్తుందని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నీటిని అనకాపల్లి వరకు తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మార్కాపురం వంటి కరువు ప్రభావిత ప్రాంతాల్లోనూ సాగునీటి సదుపాయాలు మెరుగుపరిచి అన్ని రకాల పంటలు పండే పరిస్థితులు కల్పించాలనుకుంటున్నామని వివరించారు. విశాఖపట్నాన్ని ఆర్థిక కేంద్రంగా, అమరావతిని మరో ప్రధాన ఆర్థిక ప్రాంతంగా, తిరుపతిని ఇంకో అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని చాటే కార్యక్రమాలకూ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం
పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అనవసర వాదనలకు దిగిందని చంద్రబాబు విమర్శించారు. డయాఫ్రం వాల్ దెబ్బతినే పరిస్థితులకు గత ప్రభుత్వ చర్యలు కారణమయ్యాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అనంతరం ప్రధానితో ప్రారంభించి జాతికి అంకితం చేయాలనుకుంటున్నామని తెలిపారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం పూర్తయితే నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కరువును సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు. వెలిగొండలో కృష్ణా జలాలను, అనకాపల్లిలో గోదావరి జలాలను తీసుకొచ్చిన సందర్భాల్లో నదులకు సాష్టాంగ నమస్కారం చేశానని గుర్తుచేశారు. నదులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని అన్నారు.
అమరావతి రైతుల త్యాగాలను గుర్తించాలి
అమరావతిని గతంలో స్మశానంగా అభివర్ణించారని, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను ఎగతాళి చేశారని చంద్రబాబు విమర్శించారు. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని, ఇప్పుడు మరో పేరుతో కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని అభివృద్ధి చేసి ఆర్థిక ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం వల్ల రాష్ట్రం నష్టపోయిందని, ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు. మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ నేతలు అనేక కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిజం నిప్పులాంటిదని, నిజంతో ఆటలాడితే నష్టపోతారని వ్యాఖ్యానించారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు కూటమి రూపంలో మద్దతు ఇచ్చారని, 164 సీట్లతో గెలిపించి స్థిరమైన పాలనకు అవకాశం కల్పించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందుతోందని తెలిపారు. అభివృద్ధి ఆగకుండా, సజావుగా సాగుతూ భవిష్యత్తులో ఏపీ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మారాలనేది కూటమి లక్ష్యమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల పనితీరుపైనా సమీక్ష
ప్రతి ఎమ్మెల్యే పనితీరును సమీక్షిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అధికార యంత్రాంగం మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతగా పనిచేయాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధుల పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు మరోసారి మద్దతుగా నిలవాలని చంద్రబాబు కోరారు. 2024 ఎన్నికల్లో ఏ విధంగా అండగా నిలిచారో, అదే విధంగా స్థానిక ఎన్నికల్లోనూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి బీసీలకు అవకాశాలు కల్పించామని, యువత, మహిళలు, విద్యావేత్తలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది తమ ఉద్దేశమని తెలిపారు. ప్రజలు మెచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేశామని, మేయర్ పదవులను ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించినట్లు వివరించారు. స్థానిక ఎన్నికల్లో విద్యావంతులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
దేవాలయాల పవిత్రతకు ప్రాధాన్యం
గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల పవిత్రతకు భంగం కలిగించే ఘటనలు జరిగాయని, ప్రసాదాల తయారీలో కల్తీ పదార్థాలు ఉపయోగించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం ఏ దేవాలయానికి వెళ్లినా పవిత్రమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. దేవాలయాల నిర్వహణ, భక్తుల విశ్వాసాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం ద్వారా ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. గతంలో ఇలాంటి ప్రలోభాలపై అనర్హత వేటు పడేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రతినిధులను ఎన్నుకునే పరిస్థితులు ఉండాలని అన్నారు.
ఏకగ్రీవాలపై గత ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు ప్రస్తావన
గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు భారీగా పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. 2014లో ఎంపీటీసీ నామినేషన్లలో ఏకగ్రీవాలు సుమారు 2 శాతం మాత్రమే ఉండగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో అవి 22 నుంచి 24 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. జడ్పీటీసీ స్థానాల్లోనూ అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయని అన్నారు. కడప జిల్లాలో 553 ఎంపీటీసీ స్థానాలకు గాను 439 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, 50 జడ్పీటీసీ స్థానాల్లో 38 ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని వివరించారు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ప్రక్రియపై విమర్శలు చేశారు.
ఎన్నికల కమిషన్‌పై వ్యవహారశైలిని విమర్శించిన చంద్రబాబు
ఎన్నికల కమిషన్ వద్ద వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు విమర్శలు చేశారు. బెంగళూరు నుంచి వచ్చి ఒక్కరోజులోనే పలు కార్యక్రమాలు నిర్వహించారని, మూడు గంటల పాటు ప్రెస్‌మీట్ పెట్టి నేరుగా ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ను బెదిరించేలా వ్యవహరించారని ఆరోపించారు. గతంలో ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌ను వైసీపీ ప్రభుత్వం వేధించిందని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించిన రమేశ్‌కుమార్ ఒత్తిళ్లకు లొంగకుండా ధైర్యంగా వ్యవహరించారని ప్రశంసించారు. అప్పట్లో ఎన్నికల విధుల్లో అధికారుల బదిలీల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని, ఎన్నికల కమిషనర్‌పై ముఖ్యమంత్రి, స్పీకర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు విమర్శలు చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో రమేశ్‌కుమార్ కుటుంబాన్ని కేంద్ర బలగాల భద్రతతో హైదరాబాద్‌కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారులు, రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు లొంగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మాచర్ల ఘటనల ఆధారాలను ప్రదర్శించిన సీఎం
వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఘటనలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. మాచర్లలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, గతంలో చోటుచేసుకున్న సంఘటనలకు సంబంధించిన ఆధారాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఎన్నికల ప్రక్రియలో హింస, బెదిరింపులు, అక్రమ కేసులకు తావుండకూడదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు ప్రజల సహకారం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు సీఎం చంద్రబాబు నాయుడు..

