AP LPG Supply: గ్యాస్ సరఫరా పై ప్రజలు ఆందోళన కు గురవ్వకుండా చర్యలు తీసుకోవలన్నారు సీఎం చంద్రబాబు… ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని.. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో మరింతగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టిసారించాలన్నారు.
సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రానుందని చెప్పారు. అందువల్ల రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలు వంటి ముఖ్య సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలు ఆందోళన చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. ఈకేవైసీ మరియు ఓటీపీ విధానాల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజలకు తక్షణం ఉపయోగపడే ప్రత్యామ్నాయాలపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు చేసి, పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఏపీలోని Krishna–Godavari Basin (కేజీ బేసిన్) లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్‌వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
