CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలకూ ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంతర్భాగమని, ఎలాంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసుకోవాలనే అవకాశం ప్రజలకు ఎన్నికల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. ఓటు ఒక ఆయుధమని, ఓటు హక్కు వినియోగంలో ధనిక, పేద అనే తేడా ఉండదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయాయని చంద్రబాబు అన్నారు. ఆ ఎన్నికల్లో కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని, ఇలాంటి ఫలితం గతంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం, అరాచకం, అవినీతి కారణంగా ప్రజాజీవనం స్తంభించిపోయిందని, ప్రజల్లో సంతోషం లేని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.
కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ప్రజలకు కనిపిస్తోందని చంద్రబాబు తెలిపారు. తన అరెస్టు సమయంలో 53 రోజుల పాటు ప్రజలు నిరసనలు తెలిపారని, కూటమికి ప్రజలు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్రాన్ని ఒక్కో మెట్టు పైకి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించడంతో పాటు, వృద్ధులకు పెన్షన్లు అందించి వారు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఏడాది కాలంలో ఈ హామీల కోసం రూ.36 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం పథకాలతో పాటు మత్స్యకారులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, నాయీ బ్రాహ్మణులు, ఇమాములు, పూజారులు తదితర వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయనే అంశంపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నెలలో రెండు శనివారాలు పార్టీ డేటాను పరిశీలిస్తున్నానని చెప్పారు. ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు సహా మొత్తం 55 రకాల సేవలపై ఐవీఆర్ఎస్ ద్వారా నివేదికలు తెప్పిస్తున్నామని వివరించారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇక, ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు తెలిపారు. సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, సంక్షేమాన్ని కొనసాగించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

