Site icon NTV Telugu

Liquor Prices Hike: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్.. పండుగ వేళ పెరిగిన లిక్కర్‌ రేట్లు

Liquor

Liquor

Liquor Prices Hike: సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రూ.99 ఎంఆర్‌పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచారు. ఇందులో IMFL, FL, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల మద్యం ఉత్పత్తులు ఉన్నాయి. రూ.99 ధర ఉన్న బీర్, వైన్ బాటిళ్లకు మాత్రం ఈ పెంపు వర్తించదని స్పష్టం చేసింది సర్కార్..

Read Also: Shikhar Dhawan: సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్.. ‘గబ్బర్’ లైఫ్ లో కొత్త మలుపు

ఇదే సమయంలో, మద్యం విక్రయాల్లో రిటైలర్లకు ఇచ్చే మార్జిన్‌ను కూడా ప్రభుత్వం స్వల్పంగా పెంచింది.. IMFL, FLతో పాటు రూ.99 ఎంఆర్‌పీ ఉన్న బీర్, వైన్ బాటిళ్లపై రిటైలర్ మార్జిన్‌ను 1 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మార్పులతో రిటైలర్లకు కొంత ఊరట లభించనుంది. మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రూ.99 ధర మినహా IMFL, FL లిక్కర్ బాటిళ్లపై రూ.10 పెంపు వల్ల ఈ ఆదాయం సమకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇక బార్లు మరియు మద్యం షాపుల్లో ఒకే రకమైన మద్యం ఉత్పత్తులకు వేర్వేరు ధరలు ఉండటంతో వినియోగదారుల్లో అయోమయం ఏర్పడుతోంది. ఈ అసమానతను తొలగించేందుకు ప్రభుత్వం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, షాపుల్లో ధరలు సమానంగా ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే దిశగా తీసుకున్న చర్యగా అధికారులు చెబుతుండగా, మద్యం వినియోగదారులపై మాత్రం అదనపు భారం పడనుంది. ధరల పెంపుతో మద్యం ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. సంక్రాంతి సమయంలో.. మద్యంపై ఈ అదనపు బాదుడు ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Exit mobile version