Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సహాయక చర్యలు, ప్రజల భద్రత, దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్షించారు.
ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల కలెక్టర్లతో మధ్యాహ్నం మరోసారి సమీక్ష నిర్వహించి, ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులు, తుఫాన్ కారణంగా సంభవించిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
14 జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 14 జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటివరకు 28,000 మందికి పైగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. కాకినాడ జిల్లా పరిధిలో 92 ఆవాసాలు తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. ఈ ప్రాంతంలో 9,870 మందికి పునరావాస శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. బాధితులకు అవసరమైన సదుపాయాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఇక, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థ, తాగునీటి సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనే 93 రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. దాదాపు 736 చెట్లు నేలకొరిగినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. రహదారులపై పడిన చెట్లను తొలగించడంతోపాటు వివిధ ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
చెరువులు, వాగులపై నిరంతర నిఘా
చెరువుల గట్లు, వాగులు, వంకల్లో వరద ప్రవాహంపై నిరంతర నిఘా ఉంచాలని పవన్ కల్యాణ్ సూచించారు. వరద నీటి ప్రవాహం వల్ల ప్రజలకు ప్రమాదం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా సహాయక బృందాలను అప్రమత్తంగా ఉంచాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు.. తుఫాన్ కారణంగా వ్యవసాయం, ఉద్యానవన రంగాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. సుమారు 70,000 హెక్టార్లలో పంటలు నీటమునిగినట్లు అంచనా వేశారు. మరో 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. వీటితోపాటు పెద్ద సంఖ్యలో ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. పంటలు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి పూర్తి వివరాలు సేకరించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
సహాయక చర్యల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు 16 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వివిధ శాఖలకు చెందిన దాదాపు 32,000 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడం, రహదారులు మరియు ఇతర మౌలిక వసతులను పునరుద్ధరించడం వంటి పనులను సమన్వయంతో చేపడుతున్నారు. ఇక, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించడంతోపాటు విద్యుత్, తాగునీరు, రవాణా సదుపాయాలను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందించి బాధితులకు అవసరమైన సహాయం అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

