Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్‌ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన

Heavy Rains Alert For Ap

Heavy Rains Alert For Ap

Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం వేగంగా కదులుతున్న ఈ తుపాన్‌ ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఇది అతి తీవ్ర తుఫాన్‌గా బలపడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎల్లుండి ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు!
అర్నబ్ తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి రేపు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన
తుఫాన్‌ ప్రభావంతో రేపు కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచించారు. బలమైన ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగుల సమీపంలో, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండకూడదని హెచ్చరించారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాల్లో ఏడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎనిమిది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
అర్నబ్ తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు, పడవలు, వలల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బోట్లను, వలలను సురక్షిత ప్రాంతాల్లో భద్రంగా కట్టి ఉంచుకోవాలని తెలిపారు. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడే సమయంలో తీర ప్రాంతాలకు వెళ్లి సెల్ఫీలు దిగడం, అలల దగ్గరకు వెళ్లి ప్రమాదాలకు గురికావడం వంటి పనులు చేయవద్దని హెచ్చరించారు.

అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 ను సంప్రదించాలని ప్రఖర్‌ జైన్‌ సూచించారు. తుఫాన్‌ తీవ్రత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.