Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఆర్నబ్ తుఫాన్ దూసుకొస్తుంది.. తుఫాన్ అతి తీవ్రంగా విరుచుకుపడుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావానికి అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తుఫాన్ గమనంపై నిరంతర పర్యవేక్షణ
ఆర్నబ్ తుఫాన్ కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తుఫాన్ ప్రభావంతో కురిసే వర్షాలు, వీచే ఈదురుగాలులు, వరద ప్రవాహాల తీవ్రతను ముందుగానే అంచనా వేయాలని ఆదేశించారు. పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక, గతంలో రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన తుఫాన్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి, వాటి అనుభవాల ఆధారంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా రైతులు, తీరప్రాంత ప్రజలకు తుఫాన్ ముప్పు, వర్షాలు, ఈదురుగాలులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవసరమైన ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
తీర ప్రాంత ప్రజలను షెల్టర్లకు తరలించాలి
తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే తీరప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట తుఫాన్ షెల్టర్లను సిద్ధం చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి, ప్రాణనష్టం జరగకుండా ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS), విపత్తు నిర్వహణ శాఖకు చెందిన అధికారులు హాజరయ్యారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

