YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్‌కు ప్రభుత్వం భద్రత తగ్గిస్తోందనేది వైసీపీ ఆరోపణ. గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, తెనాలి, పొదిలి, తాజాగా సత్తెనపల్లి. ఇలా ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ఆయనకు సరైన భద్రత కల్పించటం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రశ్నించే గొంతుకను లేకుండా చేస్తే… ఏపీలో ఇక తమకు అడ్డూఅదుపు ఉండదని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
Read Also: AP Liquor Scam Case: లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. వారి అరెస్ట్‌లపై ఫోకస్
జగన్ వెనక ఏదో కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్‌కు హాని కలిగించాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి సాకె శైలజానాథ్. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ తల నరికితే తప్పేంటని బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా..? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని భూస్థాపితం సీఎం చంద్రబాబు చేస్తానని హెచ్చరించడం, జీవించే హక్కు లేదని తన పార్టీ వారితో బెదిరించడం చూస్తుంటే, పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందనే విషయం అర్థమవుతోందన్నారు శైలజానాధ్. ప్రశ్నించే గొంతుక ఉండకూడదనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోందన్నారు. అందుకే జగన్‌ను లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు శైలజానాథ్.
Read Also: IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే..?
మాజీమంత్రి విడదల రజని కూడా అదే తరహా ఆరోపణలు చేశారు. జగన్‌ను లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారామె. రోజురోజుకూ జగన్‌కు పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తోందన్నారు. దారుణమైన వ్యాఖ్యలను చూస్తుంటే టీడీపీ తెర వెనుక ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు రజని. గతంలో జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి, రాయి దాడి ఘటనలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ పర్యటనలకు సరైన భద్రత కల్పించకపోవడం. జనం విపరీతంగా వస్తుండటంతో వారితో పాటు అసాంఘిక శక్తులు చొరబడి ఏదైనా చేస్తే పరిస్దితి ఏంటనే ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అయితే… జగన్‌కు భద్రత కల్పించడంలేదన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు ఇవ్వాల్సిన స్థాయిలోనే సెక్యూరిటీ ఇస్తున్నామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
