APPSC Group 1 Evaluation Scam: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 స్కామ్‌లో రంగంలోకి దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనం కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. మనీలాండరింగ్ కోణంలో హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరులోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టంలోని సెక్షన్ 17 కింద ఈ తనిఖీలు చేపట్టారు. ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక, విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం పేరుతో సుమారు రూ.1.14 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిన కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనాన్ని గతంలో హైకోర్టు ఆదేశాలతో రద్దు చేశారు. అనంతరం జవాబు పత్రాలను మాన్యువల్‌గా దిద్దే బాధ్యతను ‘కామ్‌సైన్ మీడియా’ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌లాండ్ రిసార్ట్‌కు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు మొత్తం 84 రోజుల పాటు ఓఎంఆర్ షీట్లను హాయ్‌లాండ్ రిసార్ట్‌లో ఉంచినట్లు సమాచారం. అయితే అక్కడ వాస్తవంగా ఎలాంటి మూల్యాంకనం జరగలేదని, గతంలో ఉన్న మార్కులనే కొత్త మూల్యాంకనం చేసినట్లుగా నమోదు చేసినట్లు ఈడీ ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.
పని చేయకుండానే రూ.1.14 కోట్ల చెల్లింపులు
మూల్యాంకనం జరగకపోయినా, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి సంతకంతో ప్రైవేట్ సంస్థకు రూ.1.14 కోట్ల చెక్కు విడుదలైనట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. వాస్తవంగా పని చేయకుండానే ప్రభుత్వ నిధులు చెల్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనంతరం ఈ మూల్యాంకన ప్రక్రియను అధికారులు రద్దు చేశారు. సీసీటీవీ కెమెరాల నిఘాలో తిరిగి కొత్తగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారు. చేయని పనికి చెల్లించిన రూ.1.14 కోట్లను నేరపూరిత ఆదాయంగా (Proceeds of Crime) ఈడీ గుర్తించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈడీ నిర్వహించిన సోదాల్లో కామ్‌సైన్ మీడియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రావుకు సంబంధించిన ప్రదేశాలతో పాటు హాయ్‌లాండ్ రిసార్ట్, ట్రూగ్రేడర్ సర్వీసెస్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరులోని మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.
ఈ తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. సంబంధిత వ్యక్తుల ఆస్తి పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రారంభమైన ఈ వ్యవహారం ఇప్పుడు మనీలాండరింగ్ దర్యాప్తు వరకు చేరింది. రూ.1.14 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం, ప్రైవేట్ సంస్థకు చెల్లింపులు, హాయ్‌లాండ్ రిసార్ట్‌లో జవాబు పత్రాల నిర్వహణ వంటి అంశాలపై ఈడీ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తోంది.

