APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

Cbn

Cbn

APMDC: ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ వనరుల వినియోగం, మైనింగ్ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీఎండీసీ పరిధిలో ఉన్న ఖనిజ వనరుల విలువ సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. ఏపీఎండీసీని మరింత బలోపేతం చేసే దిశగా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సంస్థను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేసి ఐపీవోకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువను రూ.86,290 కోట్లుగా అంచనా వేశారు. దీనికి అనుగుణంగా అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.

అలాగే రాష్ట్రంలో అరుదైన ఖనిజ వనరుల అన్వేషణ, అభివృద్ధి కోసం ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజ వనరులపై పట్టు సాధించేందుకు విదేశాల్లో ఉన్న కీలక ఖనిజ మైనింగ్ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఖనిజ నిక్షేపాల గుర్తింపు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ ఆధారంగా 582 ఖనిజ అన్వేషణ ప్రాంతాలను గుర్తించారు. మరోవైపు రాష్ట్రంలోని మూడు బొగ్గు బ్లాకుల్లో మొత్తం 1,774.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. ఇక, మైనింగ్ రంగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచేందుకు పెండింగ్‌లో ఉన్న క్వారీ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ దరఖాస్తుల పరిష్కారం ద్వారా సుమారు రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఖనిజ వనరుల అన్వేషణ నుంచి మైనింగ్ కార్యకలాపాలు, అంతర్జాతీయ పెట్టుబడుల వరకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..