ZP Chairman Elections: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి.. మెజార్టీ స్థానాల్లో కూటమి పార్టీలు జెండా ఎగురవేశాయి.. అయితే జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు సమయం దగ్గరపడుతున్నా కూటమి పార్టీల మధ్య పదవుల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 20వ తేదీన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏ జిల్లాలో ఏ పార్టీకి అవకాశం ఇవ్వాలనే అంశంపై కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 28 జెడ్పీ స్థానాలు ఉండగా, అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్) జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. దీంతో ఆ ఒక్క జెడ్పీ మినహా మిగిలిన 27 జెడ్పీ స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 27 జెడ్పీ చైర్మన్ పదవుల పంపకాలపై కూటమి పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన మధ్య జెడ్పీ చైర్మన్ పదవుల కోసం పోటీ నెలకొంది. శ్రీకాకుళం, కృష్ణా, పశ్చిమగోదావరి, కాకినాడ జిల్లాల జెడ్పీ చైర్మన్ పదవుల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో తమ పార్టీకి అవకాశం కల్పించాలని ఇరు పార్టీల నేతలు ఆశిస్తున్నారు.
మరోవైపు కడప జెడ్పీ చైర్మన్ పదవిని బీజేపీ ఆశిస్తోంది. అయితే కడప జెడ్పీని బీజేపీకి కేటాయిస్తారా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పదవిని బీజేపీకి ఇచ్చే విషయంపై కూటమి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈ నెల 20న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య చర్చలు వేగవంతమయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం సాధిస్తూ జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ పదవుల కేటాయింపుపై నేతలు కసరత్తు చేస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో కూటమి పార్టీల ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి, ఏ జెడ్పీ పీఠం ఏ పార్టీకి కేటాయిస్తారు..? ఎవరు కైవసం చేసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది..

