Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

Ayyannapatrudu Chintakayala

Ayyannapatrudu Chintakayala

Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉచిత పథకాలపై మాట్లాడిన ఆయన, ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..”నేను సాధారణంగా స్వేచ్ఛగా మాట్లాడే వ్యక్తిని. కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నందున నా నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా ఉంది. ఏదైనా పొరపాటున మాట్లాడితే ‘స్పీకర్ హోదాలో ఉండి ఇలా మాట్లాడారు’ అంటూ వివాదం సృష్టిస్తారు. అలా జరిగితే నాకు ఉన్న పదవి కూడా పోతుంది” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. కేరళ ప్రజలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ ప్రజలు అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఉచిత పథకాలు ఏమి వస్తాయనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అంశంపై కూడా స్పీకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేరళలో ప్రజలు పెద్దఎత్తున మొక్కలు నాటుతారని, మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టైనా నాటాలని పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ మొక్కలు నాటడం కంటే చెట్లను నరికివేయడంపైనే ఎక్కువ దృష్టి కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే రాష్ట్రం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుందని అన్నారు.

రాజకీయాలపై కూడా అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలే జరుగుతున్నాయని, అభివృద్ధి అంశాలపై చర్చలు తక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు..