AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే

Ap Mptc Zptc Elections 2026

Ap Mptc Zptc Elections 2026

AP MPTC ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు హీట్‌ పుట్టిస్తున్నాయి.. రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 23వ తేదీతో అంటే శుక్రవారంతో ముగిసిపోయింది.. ఇక, నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.. మొత్తం 28 జిల్లాల్లో ఎన్నికలు జరగనున్న 9,829 MPTC స్థానాలకు ఇప్పటివరకు 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 659 ZPTC స్థానాలకు మొత్తం 5,724 నామినేషన్లు అందాయి. రెండు విభాగాలను కలిపి మొత్తం 57,626 నామినేషన్లు దాఖలయ్యాయి.

MPTC స్థానాలకు 51,902 నామినేషన్లు

MPTC ఎన్నికలకు సంబంధించి PROFORMA-I (a) నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 9,829 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఒక్కరోజే 25,016 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకు దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 51,902కు చేరింది. పార్టీల వారీగా చూస్తే, తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున 22,013 నామినేషన్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తరఫున 20,556 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన పార్టీ (JSP) నుంచి 4,609, భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి 1,150, కాంగ్రెస్ పార్టీ (INC) నుంచి 463 నామినేషన్లు అందాయి. అలాగే CPI (M) తరఫున 434, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుంచి 173, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతర పార్టీల నుంచి 200 నామినేషన్లు రాగా, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 2,301 నామినేషన్లు అందాయి.

ZPTC స్థానాలకు 5,724 నామినేషన్లు

ZPTC ఎన్నికలకు సంబంధించి PROFORMA-I (b) నివేదిక ప్రకారం, 28 జిల్లాల్లోని 659 స్థానాలకు ఇప్పటివరకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 23న ఒక్కరోజే 3,315 నామినేషన్లు అందాయి. పార్టీల వారీగా పరిశీలిస్తే, TDP తరఫున 2,078, YSRCP నుంచి 1,815, JSP నుంచి 679 నామినేషన్లు దాఖలయ్యాయి. INC తరఫున 315, BJP నుంచి 255, BSP నుంచి 121 నామినేషన్లు వచ్చాయి. ఇతర పార్టీల నుంచి 111, CPI (M) నుంచి 74, AAP నుంచి 13 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థుల నుంచి 263 నామినేషన్లు అందినట్లు నివేదిక వెల్లడిస్తోంది.

రెండు విభాగాల్లో కలిపి 57,626 నామినేషన్లు

అక్టోబర్ 23, 2026 నాటి నివేదిక ప్రకారం, MPTC, ZPTC ఎన్నికలకు కలిపి మొత్తం 57,626 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో MPTC స్థానాలకు 51,902, ZPTC స్థానాలకు 5,724 నామినేషన్లు ఉన్నాయి. అయితే, ఈ సంఖ్యలు దాఖలైన నామినేషన్లకు సంబంధించినవే. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.