Site icon NTV Telugu

Minister Payyavula Keshav: ఢిల్లీ, కాశీ, కోల్‌కతా, లండన్‌ ఎక్కడున్నాయి జగన్‌.. మంత్రి పయ్యావుల కౌంటర్

Minister Payyavula Keshav

Minister Payyavula Keshav

Minister Payyavula Keshav: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మంత్రి పయ్యావుల కేశవ్.. మరి ఢిల్లీ, కాశీ, కోల్‌కతా, లండన్‌ ఎక్కడున్నాయి జగన్‌..? అంటూ ప్రశ్నించిన ఆయన, ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలు, రాజధానులు నదుల ఒడ్డునే ఉన్నాయని గుర్తుచేశారు. కేబినెట్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పయ్యావుల.. నాగరికత మొదలైంది నదుల పక్కనే. మనిషి జీవన వికాసం, సంస్కృతి, వాణిజ్యం, రాజ్య వ్యవస్థలు నదీ తీరాల నుంచే పుట్టాయి. అలాంటిది నది పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మించటం తప్పు అనటం అర్థరహితం అంటూ ధ్వజమెత్తారు.

Read Also: Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత.. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయడం కుదరదు..!

అమరావతి అంశంలో జగన్‌ చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవాలేనని మంత్రి మండిపడ్డారు పయ్యావుల.. అబద్ధాలు ఈ స్థాయిలో చెప్పొచ్చా..? అని ఇవాళ జగన్‌ నిరూపించారు. అబద్ధాలు ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చే వ్యవస్థలో ఆయన ఉన్నారా..? లేక ఆయన చుట్టూ ఉన్న టీమ్‌ తప్పుదారి పట్టిస్తోందా..? అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఇక, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్‌ చేసిన ఆరోపణలపైనా పయ్యావుల స్పందించారు. జగన్‌ చేసింది కేవలం రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ డిపిఆర్‌ మాత్రమే. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు జరగలేదు. మరి ప్రాజెక్టును ఆపేశారని ఆయన ఎలా చెప్తారు..? అసలు ఆగింది ఏమిటి..? ఆపింది ఎవరు..?” అంటూ నిలదీశారు.

వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం చేసిన పనులను చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు మంత్రి పయ్యావుల.. వెలిగొండ ఎక్కడ కట్టారు..? ఒకసారి వెళ్లి చూద్దాం. హంద్రీనీవాలో ఏ పనులు జరిగాయో ఆధారాలతో చూపిస్తాం. మాట్లాడితే క్రెడిట్‌ చోరీ అంటున్నారు. అసలు క్రెడిట్‌ ఎక్కడిది..? చోరీ ఎక్కడ జరిగింది..?” అని ప్రశ్నించారు. మరోవైపు, భోగాపురం విమానాశ్రయ అంశంలోనూ జగన్‌కు ఎలాంటి క్రెడిట్‌ లేదన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన అన్ని అనుమతులు చంద్రబాబు, అశోక్‌ గజపతి రాజు హయాంలోనే వచ్చాయి. మరి ఇందులో జగన్‌ క్రెడిట్‌ ఎక్కడిది..? అని ప్రశ్నించారు.

ఇక, వైఎస్‌ జగన్‌ గతంలో సీఎం‌గా ఉన్నప్పుడు 9 నుంచి 5 గంటల వరకు మాత్రమే పనిచేశారని, కానీ, చంద్రబాబు మాత్రం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల కోసం పని చేస్తారని పోల్చిచెప్పారు పయ్యావుల.. పని చేస్తే ప్రజలే క్రెడిట్‌ ఇస్తారు. కానీ అవినీతి ఆరోపణలు, అసత్య ప్రచారాలతో జగన్‌ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇకనైనా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. రాజధానిపై అర్థంలేని విమర్శలు చేయకుండా అభివృద్ధికి సహకరించాలి అని హితవు పలికారు. జగన్‌కు బ్రీఫింగ్‌ ఇచ్చే టీమ్‌ను మార్చుకోవాలని సూచించిన పయ్యావుల, ఇంకా సజ్జల లాంటి వాళ్లపై ఆధారపడితే వై నాట్‌ 175 నినాదం టీడీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయం అని వ్యాఖ్యానించారు. రాజధాని, ప్రాజెక్టుల అభివృద్ధిపై అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్షానికి సవాల్‌ విసిరారు మంత్రి పయ్యావుల కేశవ్..

Exit mobile version