NTV Telugu Site icon

Minister Nara Lokesh: టెస్లా హెడ్‌ ఆఫీస్‌కి మంత్రి లోకేష్‌.. ఈవీ రంగంలో పెట్టుబడులతో రండి..

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్.. అక్కడ వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సమావేశాలు అవుతూ.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను.. పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వివరిస్తున్నారు.. ఇక, ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయానాకి వెళ్లారు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎఫ్ఓ వైభవ్ తనేజా మాట్లాడుతూ… ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. ఇంటి నుండి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజీ పరికరాలు, సోలార్ ప్యానల్స్, సోలార్ షింగిల్స్, డ్రైవింగ్ ఇన్నొవేషన్, మోడల్ -3, పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధనరంగంలో స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది 18.8శాతం వృద్ధి సాధించి 832 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో 97బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు.

Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

ఇక, ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వాన 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మా లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అవసరమని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు, కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఆయన దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంది. ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం వహించండి. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారిస్తే సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాబోయే డేటా సెంటర్, ఐటీ హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజీ పరిష్కారాలు అవసరం, టెస్లా ఏపీకి వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం వహించండి. ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా… ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్క్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.