AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ కొనసాగుతోంది.. ఇదే సమయంలో కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు అవుతున్నాయి.. తాజాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లు ఆన్‌లైన్‌లో దాఖలు చేసే విధానాన్ని అమలు చేయడం లేదని పిటిషనర్ గురు తేజ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
ఆన్‌లైన్ నామినేషన్ విధానం అమలు చేయడం లేదని పిటిషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే, ఆ ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అమలు చేయడం లేదని ఆరోపించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ విధానం అమలు చేయడం లేదని తన పిటిషన్‌లో వివరించారు. అంతే కాదు.. ఆన్‌లైన్ నామినేషన్ విధానం అమలు చేయకపోవడం వల్ల ఈ ఎన్నికల సమయంలో 187 గొడవలు చోటుచేసుకున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగిన గొడవలు, హింసకు సంబంధించిన ఫొటోలను కూడా న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనైనా ఇలాంటి వివాదాలు, ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ఆన్‌లైన్ నామినేషన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఆన్‌లైన్ విధానానికి సిద్ధమని గతంలోనే చెప్పిన SEC
అయితే, 2025 మే నెలలోనే ఆన్‌లైన్ నామినేషన్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలిపినట్లు పిటిషనర్ తన వాదనల్లో పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ విధానం అమలులోకి రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేలా SECకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఇక, ఈ వ్యవహారంపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ విధానం అమలుపై దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయస్థానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

