AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు

Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్కామ్‌పై ఇప్పుడు ఆదాయపన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. సుమారు రూ.2000 కోట్ల అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి, పన్ను ఎగవేత కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో డబ్బు ప్రవాహం, అక్రమ సంపాదన మార్గాలు, నిధుల తరలింపు విధానాలపై ఐటీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హవాలా మార్గం ద్వారా డబ్బు విదేశాలకు తరలించబడినట్టు అనుమానిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ నిధులు దుబాయ్‌కు మళ్లించబడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. నెలకు రూ.50 నుంచి 60 కోట్ల వరకు అక్రమ నగదు సృష్టించబడినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, డిస్టలరీల నుంచి వెండర్లకు ఐదు రెట్లు ఎక్కువగా చెల్లింపులు జరిగినట్లు కూడా వెల్లడైంది. ఈ లావాదేవీల వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా, ఎలాంటి సరుకుల సరఫరా జరగకపోయినా, ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టించి రెండు డిస్టిల్లరీలు సుమారు రూ.76.92 కోట్లను తరలించినట్టు గుర్తించారు. ఈ విధంగా డిజిటల్ ట్రైల్‌ను తప్పించుకునేందుకు మొత్తం లావాదేవీలను ‘బ్లాక్ మనీ’గా దాచిపెట్టినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో పాల్గొన్న అనుమానితులపై త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం వ్యవహారంపై ఐటీ శాఖ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంటుండటంతో, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముంది.