CM Chandrababu: రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా.. ఆరు నెలల్లో అంటే.. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గృహ నిర్మాణ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, పీఎం జన్ మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1.5 లక్షల ఇళ్లను పట్టణ ప్రాంతాల్లోనూ నిర్మాణం చేయాలని సీఎం సూచించారు. డిసెంబర్ 2026 నాటికల్లా 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
పీఎంఏవై 1.0, పీఎంఏవై 2.0, పీఎం జన్ మన్ పథకాల కింద రాష్ట్రంలో 18.72 లక్షల ఇళ్ల మంజూరు కాగా.. ఇప్పటి వరకూ 13.20 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 16.11 లక్షల ఇళ్లకు గానూ ఇప్పటికే 11.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఏపీ టిడ్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకు గానూ 1.88 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని సీఎంకు వివరించారు. 2027 డిసెంబరు నాటికి 75 వేల కొత్త గృహాలను మంజూరు అయ్యేలా చూడటంతో పాటు 1.5 లక్షల ఇళ్లను పైప్ లైన్ లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన కేటాయింపులు పొందాలని సీఎం స్పష్టం చేశారు.. ఇంటి స్థలాలు లేని కుటుంబాల వాస్తవ డిమాండ్‌ను గుర్తించేందుకు ఆర్టీజీఎస్ సహా ఆవాస్ ప్లస్, హౌసింగ్, రెవెన్యూ శాఖల నుంచి డేటాను అనుసంధానం చేసుకుని డూప్లికేషన్ లేకుండా అర్హులను గుర్తించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

