AP High Court: ధర్మాన ప్రసాదరావుకు ఏపీ హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు!

Ap High Court

Ap High Court

AP High Court: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల సందర్భంగా ధర్మాన ప్రసాదరావును ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించకుండా పోలీసులు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది.

శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 26న ఉదయం 6.30 గంటలకు పోలీసులు ఎలాంటి కారణం చూపకుండా తనను గృహ నిర్బంధంలో ఉంచారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. దీంతో ఎన్నికల ఏజెంట్‌గా తన బాధ్యతలను నిర్వహించకుండా అడ్డుకున్నారని పేర్కొంటూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్నికల ఏజెంట్ అనేది ఎన్నికల ప్రక్రియలో భాగమని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఏజెంట్లను అనుమతించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావును ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించకుండా అడ్డుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది. శ్రీకాకుళం మేయర్ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.