BC Reservations: ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ణయించారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే, కమిషన్ నివేదికను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటికీ ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని, ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికారులు కోర్టుకు వివరించారు. దీంతో ప్రభుత్వం ఆమోదించని నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయిస్తూ జీవో ఎలా జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించింది.
అయితే, కమిషన్ నివేదికలో ఉన్న డేటా ఆధారంగానే జీవో జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. నివేదికలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయని, వాటిని ఏ విధంగా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కోర్టుకు వివరించింది. బీసీల జనాభా 50 శాతంగా ఉన్నట్లు కమిషన్ నివేదికలో పేర్కొన్నారని, అందుకే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగపరంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఉందని వాదించారు. గతంలో కూడా ఇదే తరహాలో జీవోలు జారీ చేయగా హైకోర్టు, సుప్రీంకోర్టు వాటిని డిస్మిస్ చేసిన విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. డెడికేటెడ్ కమిషన్ నివేదికను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే 34 శాతం బీసీ రిజర్వేషన్లు నిర్ణయించేందుకు ప్రభుత్వం చేసిన కసరత్తు ఏమిటి, అందుకు సంబంధించిన డేటా ఏమిటో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కమిషన్ నివేదిక, రిజర్వేషన్లకు సంబంధించిన డేటాను పరిశీలించిన అనంతరం తదుపరి విచారణలో అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

