AP High Court: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సహాయంతో ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై న్యాయవ్యవస్థలో అప్రమత్తత అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చే విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని న్యాయమూర్తులకు హైకోర్టు సూచించింది. ఏఐ సాధనాలు న్యాయాధికారులకు సహాయక సాధనాలు మాత్రమేనని, విశ్లేషణ సామర్థ్యానికి మానవ మేధస్సే ప్రత్యామ్నాయమని పేర్కొంది. ఏఐ ఇచ్చే సమాధానాలు నమ్మకంగా కనిపించినా, చట్టపరంగా తప్పులు ఉండే అవకాశముందని హెచ్చరించింది.
Read Also: IND vs NZ 4th T20: అలా కొట్టేసారు ఏంటి కివిస్ మామలు.. భారత్ టార్గెట్ ఏంటంటే?
ఏఐ సాధనాలు కొన్ని సందర్భాల్లో అసలు ఉనికిలోనే లేని తీర్పులను సృష్టించడం, కేసుకు సంబంధం లేని తీర్పులను ఉదహరించడం అత్యంత ఆందోళనకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పిదాలు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఏఐని ఇష్టారీతిగా ఉపయోగిస్తే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. ఈ కేసులో, తన ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని తీర్పులు ఏఐ ద్వారానే వచ్చినవని, తొలిసారి ఏఐని ఉపయోగించిన కారణంగా ఈ పొరపాటు జరిగిందని సంబంధిత న్యాయాధికారి హైకోర్టుకు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే, తన ఉత్తర్వుల్లో అన్వయించిన చట్టసూత్రం మాత్రం సరైనదేనని న్యాయాధికారి పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏఐ వినియోగంపై న్యాయాధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, తీర్పులు పూర్తిగా చట్టపరమైన సూత్రాల ఆధారంగానే ఉండాలన్నదే హైకోర్టు స్పష్టమైన సందేశంగా నిలిచింది.
