AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్‌ బెయిల్

Ap High Court

Ap High Court

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూనే.. కొన్ని షరతులు విధించింది హైకోర్టు.. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, నిర్దిష్ట షరతులతో వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు విధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

ఏపీ లిక్కర్ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనూ, పరిపాలనా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హైకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, కోర్టు ఆదేశాలతో నిందితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.. మరోవైపు, సుప్రీంకోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. ఏపీ లిక్కర్ కేసులో దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ కొట్టివేయాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.. ఈ పిటిషన్‌లో పలు సందేహాలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తం చేయగా.. ఏమైనా సందేహాలుంటే సరైన సమయంలో తమ అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది..