BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్

Ap High Court

Ap High Court

BC Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిల్‌ను కొట్టివేయాలని కోర్టును ప్రభుత్వం కోరింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి బీఏవీపీ కుమారరెడ్డి కౌంటర్ దాఖలు చేశారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు క్షేత్రస్థాయి వాస్తవాలు, సమకాలీన గణాంకాల ఆధారంగానే నిర్ణయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, సరిచూసి, నవీకరించినట్లు తెలిపింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో బీసీలు 50.42 శాతం ఉన్నారని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. స్థానిక పాలనలో బీసీలకు అర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అందుకు తగిన స్థాయిలో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని, అందుకే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు కౌంటర్‌లో వివరించింది.

అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారుకు మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. బీసీల సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, జనాభా, స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యంపై కమిషన్ ఆధారాలను పరిశీలించిందని పేర్కొంది. 2020లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో ప్రస్తుత కుటుంబ సర్వే వంటి సమకాలీన సమాచారం అందుబాటులో లేదని ప్రభుత్వం తన కౌంటర్‌లో పేర్కొంది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రక్రియ సమకాలీన ఆధారాలను పరిశీలించాలన్న న్యాయస్థానాల మార్గదర్శకాలకు అనుగుణంగానే కొనసాగుతోందని స్పష్టం చేసింది.