Site icon NTV Telugu

Amaravati Land Allotment: 11 ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులు.. ప్రభుత్వం ఆదేశాలు..

Amaravati

Amaravati

Amaravati Land Allotment: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌.. రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ప్రతిష్టాత్మక సంస్థలను రాజధానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే పలు సంస్థలకు భూములు కేటాయించగా.. తాజాగా, మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలకు భూముల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల బృందం చేసిన సిఫార్సుల ఆధారంగా భూముల కేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 49.50 ఎకరాల భూమిని 11 సంస్థలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. గతంలో జరిగిన భూ కేటాయింపుల్లో మార్పులు చేసింది..

తాజాగా జరిగిన భూమి కేటాయింపు వివరాలు:
* బాసిల్ ఉడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి – ఎకరం రూ.50 లక్షల చొప్పున 4 ఎకరాలు
* సెయింట్ మోరీస్ స్కూల్‌కి – ఎకరం రూ.50 లక్షల చొప్పున 7.97 ఎకరాలు
* సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌కి – 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన 15 ఎకరాలు
* కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కార్యాలయానికి – 5 ఎకరాలు
* ఎన్టీపీసీకి – 1.50 ఎకరాలు
* జ్యూడీషియల్ అకాడమీకి – 4.83 ఎకరాలు
* కేంద్ర ప్రభుత్వ ప్లానిటోరియం ప్రాజెక్ట్‌కి – 5 ఎకరాలు
-ఐఓబీ, పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంకులకు – ఒక్కో బ్యాంకుకు 0.40 సెంట్లు చొప్పున స్థలం
* నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) – 5 ఎకరాలు

గతంలో జరిగిన భూ కేటాయింపుల్లో మార్పులు:
మరోవైపు, రాజధాని అమరావతి ప్రాంతంలో గతంలో భూములు కేటాయించిన పలు సంస్థలకు సంబంధించి ప్రభుత్వం సవరణలు చేసింది. 6 సంస్థలకు ఇచ్చిన 67.4 ఎకరాలను 42.30 ఎకరాలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. 8 సంస్థల రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లకు ఇచ్చిన 32.65 ఎకరాలను 12.66 ఎకరాలకు తగ్గించింది. మరో 6 సంస్థలకు గతంలో కేటాయించిన 13.1 ఎకరాలను 16.19 ఎకరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సంస్థలకు రాయితీపై, లీజు ప్రాతిపదికన భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.. తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ ను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ జారీ చేశారు.

Exit mobile version