NTV Telugu Site icon

Telugu Language Day 2024: తెలుగు భాషా దినోత్సవం.. తెలుగు వెలగాలి.. తెలుగు భాష వర్థిల్లాలి..

Telugu Language Day

Telugu Language Day

Telugu Language Day 2024: దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పూర్వికులు.. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కీర్తించారు.. తేనెలొలుకు భాష.. మన తెలుగు భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష.. అయితే, క్రమంగా వస్తున్న మార్పులతో తెలుగు భాష కనుమరుగు అవుతుందేమోనని ఆందోళన వ్యక్తం అవుతుంది.. ఇతర భాషలపై మమకారంతో తెలుగు భాషకు దూరం అవుతున్నారని గుర్తించిన ప్రభుత్వాలు.. స్కూళ్లను తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా భోదించాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. మరోవైపు. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించింది.. తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈ తేదీని తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవం.. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషిచేసిన వ్యక్తి గిడుగు వెంకట రమమూర్తి పంతులు.. తెలుగు భాషాభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు అందజేసి అవార్డులను కూడా అందజేస్తూ వస్తున్న విషయం విదితమే.

మరోవైపు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఏపీ గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం.. మంత్రులు ఇలా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు..

“తెలుగదేల యెన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స” అంటూ తెలుగు భాషా దినోత్స శుభాకాంక్షలు తెలిపారు ఏపీ గవర్నర్..

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు.. తెలుగు భాషాభివృద్దికి విశేష కృషి చేసిన మహనీయులను నేడు తలుచుకోవడం ద్వారా అమ్మభాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదాం. వారి అడుగుజాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందాం. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహద్ బాధ్యత మనం తీసుకుందాం. అదే వారికి మనమిచ్చే ఘననివాళి. తెలుగు వెలగాలి…తెలుగు భాష వర్థిల్లాలి అని కోరుకుంటూ దాని కోసం పనిచేద్దాం.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేశారు..

ఇక, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన అమ్మ భాషను గౌరవించుకొందాము… నవ తరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియచేద్దాము. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషకు తీసుకువచ్చి రచనలు చేయడం వల్లే భాషా సౌందర్యం ఇనుమడించింది. ఇందుకు వ్యావహారిక భాషోద్యమ మూల పురుషుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకొంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారికి అంజలి ఘటిస్తున్నాను. పాఠశాల స్థాయి నుంచి మన విద్యార్థులకు తెలుగు భాష నేర్పించడం ద్వారా మాతృ భాష విలువ తెలియడమే కాదు… వారి ఆలోచన పరిధి విస్తృతమవుతుంది. తీయ తేనీయల తెలుగు అని కీర్తిస్తారు. ఆ తీయదనాన్ని భావితరాలకు అందిద్దాము. ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ తెలుగు భాష వినియోగం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నిత్య వ్యవహారంలోనూ మన భాషకు పట్టం కట్టినప్పుడే తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది. అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ శుభాకాంక్ష‌లు. తెలుగు వాడుక భాష‌లో రచనలు ఉండాల‌ని జీవితాంతం ఉద్య‌మించిన వ్య‌వ‌హారిక భాషా పితామ‌హుడు గిడుగు రామ‌మూర్తి గారి జ‌యంతిని తెలుగు భాషా దినోత్స‌వంగా నిర్వ‌హించుకోవ‌డం, ఆ మ‌హ‌నీయుని కృషిని స్మ‌రించుకునే అవ‌కాశం తెలుగువారిగా మ‌న‌కు ద‌క్కింది. అమ్మ జ‌న్మ‌నిస్తే, మాతృభాష తెలుగు మ‌న జీవితాల‌కు వెలుగునిస్తోంది. ఇంగ్లీషు మీడియం, విదేశాల్లో చ‌దువు వ‌ల్ల నేను మొద‌ట్లో తెలుగులో మాట్లాడేట‌ప్పుడు ప‌దాలు అటు ఇటు అయితే.. ఎంతో బాధ‌ప‌డేవాడిని. అచ్చ‌మైన తెలుగులో నిత్యం జ‌నంతో మాట్లాడుతూ ఉంటే మాతృభాష మాధుర్యం ఎంత గొప్ప‌దో తెలుస్తోంది. మా అబ్బాయి దేవాన్ష్‌కి ప్ర‌త్యేకంగా తెలుగు మాట్లాడ‌ట‌మే కాదు.. చ‌ద‌వ‌టం, రాయ‌టం కూడా నేర్పిస్తున్నాను. తెలుగువారిగా గ‌ర్వ‌ప‌డ‌దాం.. తెలుగు భాష ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేద్దాం. తెలుగు భాషని సుసంప‌న్నం చేస్తున్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. అంటూ ట్వీట్‌ చేశారు మంత్రి నారా లోకేష్‌.

Show comments