AP Economic Regions: విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. మూడు రీజియన్లల్లో చేపట్టిన ప్రణాళికలు.. అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల గ్రౌండింగ్ వంటి అంశాలపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాయలసీమ ప్రాంతంలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలను ప్రోత్సహించనున్నారు. అమరావతి పరిధిలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాలను అభివృద్ధి చేయాలని కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మూడు ఆర్థిక ప్రాంతాల్లో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 167 అభివృద్ధి పనులు
విశాఖ ఎకనమిక్ రీజియన్ (VER) పరిధిలో వివిధ శాఖల ద్వారా 167 అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో ఇప్పటికే 64 పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రీజియన్‌కు యాంకర్ ప్రాజెక్టుగా వైజాగ్ బే సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడ ఇండస్ట్రియల్ సిటీ అభివృద్ధితో పాటు పోర్టుల విస్తరణకు చర్యలు చేపట్టనున్నారు. విశాఖలో కొత్తగా 15 నుంచి 20 ఐటీ సంస్థలను ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన హామీని కార్యరూపంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తీర ప్రాంత అభివృద్ధి, కోనసీమ బ్యాక్‌వాటర్స్ అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అరకు, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు.
తిరుపతి ఎకనమిక్ రీజియన్‌లో పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం
తిరుపతి ఎకనమిక్ రీజియన్ (TER)ను అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, స్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్, ఆటోమొబైల్, ఈవీ, డిఫెన్స్, టూరిజం, నాలెడ్జ్ రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని 87 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 66 ప్రాజెక్టుల పెట్టుబడులు తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోనే ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. హార్టికల్చర్ హబ్ అభివృద్ధిలో భాగంగా డెయిరీ ప్రాసెసింగ్, మీట్ అండ్ పౌల్ట్రీ, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, టెర్మినల్ మార్కెట్ల వంటి క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 14 పట్టణాలను వివిధ రంగాలకు అనుగుణంగా పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, తయారీ రంగం, పర్యాటకం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడంపై దృష్టి సారించారు.
అమరావతి ఎకనమిక్ రీజియన్‌లో రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలకు ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కోస్టల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా సూర్యలంక, ఓడరేవు, రామాపురం, చినగంజాం, నిజాంపట్నం, దిండి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.
మూడు ప్రాంతాల ద్వారా సమగ్ర అభివృద్ధి లక్ష్యం
మూడు ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. విశాఖలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, తిరుపతిలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, అమరావతిలో క్వాంటం టెక్నాలజీ, లాజిస్టిక్స్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రణాళికల అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

