NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: వన మహోత్సవంలో భాగస్వాములు కండి.. ఇది సామాజిక బాధ్యత.. ఈ మొక్కలే నాటండి..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలి.. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.. ఇది సామాజిక బాధ్యత అంటూ పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు పవన్ కల్యాణ్ కోరారు.. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ రోజు వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్న వేళ రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందించారు పవన్‌.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోండి. మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు పవన్‌..

Read Also: Balakrishna-Bobby: సంక్రాంతికి కాదు.. ఆ సెంటిమెంట్‌ రోజే సినిమా విడుదల!

రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు జరగబోయే వనమహోత్సవం కార్యక్రమంలో నాటబోయే మొక్కల జాతుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌… దేశీయ జాతులను ఎంపిక చేసుకోవాలి. స్థానిక వృక్ష జాతులకు చెందిన మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడవచ్చు. పర్యావరణ సమతుల్యత, మానవ ఆరోగ్యాన్ని కాపాడినవాళ్లమవుతాం. మన దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే, అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వేగంగా పెరుగుతాయని, ఎవెన్యూ ప్లాంటేషన్ అని, నిర్వహణ ఖర్చులు తక్కువ అనే కోణంలో గత దశాబ్ద కాలంగా కోనో కార్పస్, ఏడు ఆకుల పాల, మడగాస్కర్ ఆల్మన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి అన్యజాతుల మొక్కలను నాటారు. వీటి వల్ల పర్యవరణానికి మేలు కంటే కూడా కీడు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్య జాతుల మొక్కలు- భూగర్భ జలసంపద మీద ప్రభావం చూపడంతోపాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయి అని హెచ్చరించారు..

Read Also: Mumbai Heroine Jathwani Issue: నేడు విజయవాడకు ముంబై నటి జత్వానీ.. సీపీతో భేటీ..!

ఇక, అరబ్ దేశాల్లో పచ్చదనం కోసం కోనోకార్పస్ జాతి మొక్కలను విరివిగా పెంచారు. అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకొని అరబ్ దేశాలే ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయి అని గుర్తు చేశారు పవన్‌ కల్యాణ్‌.. దేశంలోనూ తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్ ను నిషేధించాయి. కోనోకార్పస్ వల్ల జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయి. భూగర్భ జలసంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కోనోకార్పస్ మొక్కను పశువులు తినవు. పక్షులు గూడుపెట్టుకోవు. చెట్లను ఆశ్రయించే క్రిమికీటకాలు రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచుకోవడం సరికాదు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఈ మొక్కను నాటడం మానేయాలని కోరారు.. కార్తీకమాసం వనసమారాధన వరకు జరిగే ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలు చేసే మొక్కలను విరివిగా పెంచుదాం. కానుగ, వేప, రావి, చింత, ఉసిరి, శ్రీగంధం, మర్రి, అశోక, రేలా, దిరిసెం మారేడు, నేరేడు, దేవకాంచన, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, సీత అశోక, వెలగ, సీతాఫల వంటి ఎన్నో మనకు ఉపయోగపడే మన జాతులు మొక్కలను పెంచుదాం అని పిలుపునిచ్చారు. పదిమందికి నీడనిస్తూ, వాటి ఉత్పత్తులను పంచే మొక్కలను నాటుకుందాం. 29శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతం చేర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందరం సమష్టిగా వన మహోత్సవంలో పాల్గొని రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపుదాం.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..