Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్.. ఫ్లెమింగోల శాశ్వత స్థావరంగా తీర్చిదిద్దుతాం..

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్.. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. పులికాట్ సరస్సుకు శీతాకాలపు అతిథుల రాక మొదలైంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి సైబీరియా నుంచి వచ్చి చేరిన ఫ్లెమింగోలు.. మన అందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి. ఆహారం, విశ్రాంతి కోసం వచ్చే ఆరు నెలలపాటు పులికాట్ పరిసరాల్లోనే నివసిస్తాయి. అందుకే ప్రతి ఏడాది ఈ నీటి పక్షుల రాకను ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ పేరిట ఘనంగా జరుపుకుంటాం. మూడు రోజుల పండుగకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది సందర్శకులు రావడం.. ఈ పక్షులతో మనకున్న అనుబంధానికి నిదర్శనం. మనమందరం ముద్దుగా ‘రాజహంస’ అని పిలిచే ఈ ఫ్లెమింగోలు జీవ వైవిధ్యానికి ప్రతీకలు. అక్టోబర్ లో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లే ఈ విదేశీ అతిథులు.. ఇటీవల మాత్రం సంవత్సరం పొడవునా పులికాట్ ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. అంటే, ఇక్కడి వాతావరణం, ఆహారం, భద్రత.. ఇవన్నీ వీటి సహజ జీవనానికి ఎంతగానో అనుకూలిస్తున్నాయనే మాట అన్నారు పవన్‌..

Read Also: Chevella Bus Accident: 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

ఇక, ఎకో టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా.. ఫ్లెమింగోలు ఇక్కడే శాశ్వత నివాస స్థావరం ఏర్పరుచుకునేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పక్షుల ఆహారం, విశ్రాంతి, భద్రతకు ఎటువంటి అంతరాయం కలగకుండా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈసారి పండుగను కేవలం మూడు రోజులకే పరిమితం చేయకుండా.. ఫోటోగ్రఫీ టూర్స్, బర్డ్ సీయింగ్ క్యాంపులు, ఎకో క్లబ్ కార్యకలాపాలు ప్రారంభించామని చెప్పారు. ఇక, మొంథా తుపాను ప్రభావం సమయంలో కూడా ఫ్లెమింగో నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రానున్న మూడు నెలల పాటు ఫ్లెమింగో రక్షణపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పులికాట్ ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా, అలాగే అంతర్జాతీయ ఎకో టూరిజం గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version