CM Chandrababu: ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఉదయం 11 గంటలకు ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి మొత్తం 11 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల చెల్లింపులు, ఇతర ఆర్థిక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగ సంఘాలు జిల్లా వారీగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. ఆ చర్చలకు సంబంధించిన నివేదిక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరింది. ఈ నేపథ్యంలో నేటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, పీఆర్సీ కమిషన్ నియామకంపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ ఆర్థిక డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీ ఉద్యోగులు 25 శాతం తక్కువ వేతనాలు పొందుతున్నారని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు పేర్కొన్నారు. తమ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆర్థిక అంశాలపై స్పష్టత కోరుతామని ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు సాగర్ తెలిపారు. తమ డిమాండ్లపై నిర్ణయం తీసుకోకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.

