Site icon NTV Telugu

CM Chandrababu: సీఎం తీవ్ర అసంతృప్తి.. పబ్లిక్ పర్సెప్షన్ 80 – 90 శాతం ఉండాల్సిందే..!

Cbn

Cbn

CM Chandrababu: పాలన కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, ప్రజల నుంచి వచ్చే సానుకూల స్పందనే (Public Perception) అసలైన సర్టిఫికేట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా అందిన సర్వే నివేదికలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు…

బస్టాండ్ల దుస్థితిపై ఆగ్రహం
రాష్ట్రంలోని పలు ప్రధాన బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు అత్యంత దారుణంగా ఉన్నాయని సీఎం మండిపడ్డారు. ముఖ్యంగా పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి వంటి ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్వేలో తేలింది. టాయిలెట్లు అధ్వాన్నంగా ఉండటం, ఫ్యాన్లు తిరగకపోవడం, సరైన తాగునీరు మరియు కూర్చునే సదుపాయం లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్టాండ్లలో తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలని, ప్రయాణికుడికి గమ్యం చేరే వరకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని స్పష్టం చేశారు.

పెన్షన్లు మరియు దీపం పథకం
పెన్షన్ల పంపిణీలో ఎక్కడా జాప్యం జరగకూడదని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ‘స్వర్ణ గ్రామాలు’, ‘స్వర్ణ వార్డుల’పై ప్రత్యేక దృష్టి సారించి, అట్టడుగు స్థాయి వరకు లబ్ధిదారులకు సేవలు అందేలా చూడాలన్నారు. అలాగే, దీపం పథకం కింద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో ఎవరైనా అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అవినీతి రహిత రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న మార్పులపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేస్తూనే, కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం నిజాయితీ కలిగిన అధికారులకే పోస్టింగ్ ఇవ్వాలని, అవినీతికి తావు లేకుండా స్లాట్ బుకింగ్ మరియు డిజిటల్ సేవలు కొనసాగాలని చెప్పారు.

భద్రతా చర్యలు మరియు సాంకేతికత
రాష్ట్రంలో బాణసంచా పేలుడు వంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి, అధికారుల బృందం తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అక్కడ పాటిస్తున్న రక్షణ చర్యలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ‘వాట్సప్ మనమిత్ర’ సేవలను 100 శాతం వినియోగంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మొత్తంగా ప్రభుత్వ పనితీరుపై ప్రజల పాజిటివ్ పర్సెప్షన్ 80 నుండి 90 శాతం వరకు ఉండాలి. అధికారులు కేవలం ఏసీ రూములకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Exit mobile version