Site icon NTV Telugu

AP Cabinet: డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం..

Parthasarathy

Parthasarathy

AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.. గత వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగా మృతి చెందిన డాక్టర్‌ సుధాకర్‌ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. ఇందులో భాగంగా ఆయన కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. అలాగే, సహకార శాఖలో ప్రస్తుతం జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ సుధాకర్‌ కుమారుడు సి.కె. లలిత్‌ ప్రసాద్‌కు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకు గ్రూప్‌–2 హోదా కలిగిన డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు ఉద్యోగపరమైన స్థిరత్వం కూడా కల్పించినట్టు తెలిపారు.

Read Also: Minister BC Janardhan Reddy: రాయలసీమ ప్రజలపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారు.. బీసీ జనార్ధన్‌ రెడ్డి ఫైర్

ఇక రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ అంశాలపైనా కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ప్రతిపాదించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ పరిశ్రమలు, సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపుల ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విద్యార్థుల సంక్షేమం కోసం పాఠశాల కిట్‌ల పంపిణీకి రూ.944.53 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు మంత్రి పార్థసారధి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 39.52 లక్షల మంది విద్యార్థులకు కిట్‌ల సరఫరా చేసిన సంస్థలకు చెల్లించాల్సిన రూ.944 కోట్ల బకాయిలను చెల్లించేందుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

అదే విధంగా, రాష్ట్రంలో లాజిస్టిక్స్‌ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీ లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కీలక మలుపు అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఒకవైపు బాధిత కుటుంబానికి మానవీయ సాయం అందించడమే కాకుండా, మరోవైపు విద్య, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడతాయని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతోందని తెలిపారు మంత్రి పార్థసారథి..

Exit mobile version