AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం

Satya Kumar Yadav

Satya Kumar Yadav

AP BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ముందకు సాగుతోంది కూటమి ప్రభుత్వం.. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్‌ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. బీసీలను అణగదొక్కాలనే భావన కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, దాని అనుబంధంగా ఉన్న పిల్ల కాంగ్రెస్‌లోనూ ఉందని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై వైసీపీ వైఖరిని ప్రశ్నించారు. గతంలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను వైఎస్ జగన్ ప్రభుత్వం 24 శాతానికి ఎందుకు తగ్గించిందని సత్యకుమార్ ప్రశ్నించారు. న్యాయస్థానాల గురించి అవగాహన ఉన్న జగన్.. బీసీల సాధికారత విషయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు. బీసీలకు న్యాయం జరిగేలా సమస్యను పరిష్కరించేందుకు అప్పట్లో ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జీవో జారీ చేసిందని వెల్లడించారు సత్యకుమార్‌. అయితే, ఈ నిర్ణయాన్ని వైసీపీ న్యాయస్థానాల్లో సవాల్ చేసిందని తెలిపారు. హైకోర్టులో జీవో కొట్టివేతకు గురైందని, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా అనుకూల తీర్పు రాలేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు స్థానిక జనాభా వివరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని డెడికేటెడ్ కమిషన్ సూచించిందని వివరించారు. కమిషన్ సిఫారసుల మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. మిగిలిన 6 శాతం ప్రాతినిధ్యాన్ని పార్టీ పరంగా కల్పిస్తామని స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం, వారికి తగిన అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు మంత్రి సత్యకుమార్‌..