Deputy CM Pawan Kalyan: పాత మడ అడవుల పరిరక్షణ.. కొత్త మడ అడవుల పెంపకంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తీర ప్రాంతానికి మడ అడవులే రక్షణ గోడ. సముద్రపు అలలు, తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరాన్ని కాపాడే సహజ కవచంగా మడ అడవులు నిలుస్తున్నాయి. వాటి సంరక్షణతో పాటు విస్తరణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రాష్ట్ర అటవీ–పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ‘మడ అడవుల పెంపుదల – సుస్థిర ఆదాయం’ అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్ విజయవాడలో ప్రారంభమైంది. మడ అడవుల పెంపుదల సుస్థిర ఆదాయం పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి–అధికారులు ప్రారంభించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వర్క్‌షాప్‌లో మడ అడవుల సంరక్షణ, విస్తరణ, జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలతో పాటు.. వాటి ద్వారా తీర ప్రాంతవాసులకు సుస్థిర ఆదాయ మార్గాలు కల్పించడంపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థలు, పర్యావరణ నిపుణులు, తీర రక్షణ పరిశోధకులు, ఫుడ్–ఎకో టూరిజం రంగ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. MISHTI కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడం ఈ వర్క్‌షాప్ ప్రధాన లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్య పెంపుదలలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో రోల్ మోడల్‌గా నిలవాలి. 1052 కిలోమీటర్ల పొడవైన మన తీరానికి మడ అడవులు రక్షణ గోడలాంటివి. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే బలమైన కవచం ఇవి అని పేర్కొన్నారు.
ఉన్న మడ అడవులను సంరక్షిస్తూ, కొత్తగా వాటిని పెంచడమే మన లక్ష్యం. గోదావరి, కృష్ణా బేసిన్లలో తుపాన్ల నష్ట నివారణకు మడ అడవుల విస్తరణ కీలకం. అందుకే తీర ప్రాంతంలో మూడు దశల గ్రీన్ బెల్ట్ అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నాం అని తెలిపారు పవన్ కల్యాణ్.. మడ అడవుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను వివరించిన పవన్.. 2025లో రాష్ట్ర తీర ప్రాంతంలో 700 హెక్టార్లలో మడ అడవుల అభివృద్ధి పనులు చేపట్టాం, ఉన్న అడవుల సంరక్షణతో పాటు కొత్త మడ అడవుల పెంపకమే లక్ష్యం, గోదావరి, కృష్ణా డెల్టాల్లో తుపాన్ల నష్ట నివారణకు మడ అడవుల విస్తరణ కీలకం అని స్పష్టం చేశారు. ఇక, మడ అడవులు కేవలం పర్యావరణ రక్షణకే కాదు.. తీర ప్రాంత ప్రజలకు సుస్థిర ఆదాయ మార్గాలు కూడా కావాలి. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఎకో టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం. గిరిజనులకు అటవీ నర్సరీల ద్వారా ఆదాయం పెంపే లక్ష్యం అని తెలిపారు.
రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతోంది. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది అని తెలిపారు.మానవ–జంతు సంఘర్షణ నివారణలో కర్ణాటకతో సమన్వయం మంచి ఫలితాలు ఇచ్చిందని పవన్ తెలిపారు. కుంకి ఏనుగుల వినియోగం, హనుమాన్ ప్రాజెక్టు ద్వారా ఆధునిక సాంకేతికత వినియోగం వంటి చర్యలు విజయవంతమయ్యాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి ఇతర రాష్ట్రాలతో సహకారం కొనసాగుతుంది అని పేర్కొన్నారు. ఇక, అటవీ శాఖ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పవన్ ప్రకటించారు. అటవీ సిబ్బంది సంక్షేమానికి రూ.5 కోట్ల నిధి మంజూరు చేశాం, రాజకీయ ఒత్తిళ్లు ఉండవు, పూర్తి స్వేచ్ఛతో పనిచేయొచ్చు అని హామీ ఇచ్చారు, అటవీ శాఖ సంక్షేమానికి మరో రూ.5 కోట్ల ప్రత్యేక నిధి కూడా ప్రకటించారు పవన్ కల్యాణ్..