CM Chandrababu: జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నెల నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ నోటిఫికేషన్‌పై నెల రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం, నిర్దేశించిన గడువును నేటితో ముగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు అందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజాభిప్రాయం, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. అభ్యంతరాల పరిశీలన, మార్పులు–చేర్పుల ప్రక్రియ పూర్తయ్యాక డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పునర్విభజన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త మండలాల ఏర్పాటు, మరికొన్నిచోట్ల విలీనం, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలు కూడా సమీక్షలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also: Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఛార్జిషీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్!
