Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్‌..

Amaravati

Amaravati

Amaravati Land Pooling: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో విడత భూసమీకరణ ప్రక్రియకు అడుగులు పడ్డాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలో కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా భూములను సమీకరించేందుకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. మోతడక గ్రామంలో చేపట్టనున్న ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించిన భూములను ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణానికి వినియోగించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. అమరావతి రాజధాని ప్రాంతంలో భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భూసమీకరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

మోతడకలో 2,344.12 ఎకరాల భూమి

సీఆర్డీఏ వివరాల ప్రకారం మోతడక గ్రామంలో మొత్తం 2,344.12 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1,654.259 ఎకరాల పట్టా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించనున్నారు. మిగిలిన భూమి ప్రభుత్వానికి చెందినదిగా సీఆర్డీఏ పేర్కొంది. అయితే, అమరావతిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా మోతడకలో నోటిఫికేషన్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ వంటి కీలక ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సమీకరించడంతో రాజధాని ప్రాంతంలో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

ఇక, ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది.. 596 కోట్ల రూపాయలో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, మరోవైపు 1,430 కోట్ల రూపాయాలతో క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అనుమతులు లభించినట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు.. ఇక, రాజధాని పరిధిలోని 29 గ్రామాల లేఅవుట్ రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించగా.. అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు అందించేందుకు అంగీకరించారు..