Akvan Cyclone Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుపాను నరసాపురానికి 470 కిలోమీటర్లు, కళింగపట్నానికి 490 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 580 కిలోమీటర్లు, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక, అక్వాన్ తుఫాన్ రేపు మధ్యాహ్నానికి నరసాపురం-పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించారు.
మరోవైపు.. తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

