Heavy Rains and Floods in AP: భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి.. ఇంకా వర్షం ముప్పు పొంచిఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది.. అయితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టం.. పంట నష్టం.. ఇతర విషయాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఓ ప్రకటన విడుదల చేసింది.. రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతిచెందారు.. ఇద్దరు గల్లంతు అయినట్టు పేర్కొంది.. ఇక, 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని.. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని వెల్లడించింది.
Read Also: AP and Telangana Rains LIVE UPDATES: వరుణుడి ప్రతాపం.. రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మరోవైపు.. అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో 1,808 కిలో మీటర్ల పొడువున ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నట్టు పేర్కొంది కమాండ్ కంట్రోల్ రూమ్.. ఇక, 1,72,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగిపోయాయని తెలిపింది.. ప్రకాశం బ్యారేజీ వద్ద 11,25,876 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.. 41,927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించాం.. 171 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామని.. సహాయక చర్యల్లో 36 NDRF, SDRF బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నారని పేర్కొంది. బాధితులకు ఈ రోజు 3 లక్షల ఆహార ప్యాకేట్లు, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నాం.. 188 బోట్లును, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం.. ఎటువంటి సహాయనికైన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.. ఇక, ముంపు భాదిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది.. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేశారు.. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నం ఉందని వెల్లడించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..