Site icon NTV Telugu

Pregnant Woman in Dolly: ప్రసవానికి ఎన్ని కష్టాలు..! వర్షంలో కిలోమీటర్ నడక, 4 కిలో మీటర్లు డోలీలో..

Pregnant Woman In Dolly

Pregnant Woman In Dolly

Pregnant Woman in Dolly: గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు.. ప్రభుత్వాలు మారినా.. కొత్త పీఎంలు వచ్చినా.. నయా ముఖ్యమంత్రులు పీఠాలు ఎక్కినా.. ఇంకా.. కనీస సౌకర్యాలకు ఆమడం దూరంలోనే బతుకులు వెళ్లదీస్తున్నారు.. చివరకు అనారోగ్యం చేసి ఆస్పత్రికి వెళ్లాలన్నా.. ప్రసవం కోసం పెద్దాస్పత్రిలో చేరాలన్నా.. ఇంకా వాళ్లు డోలీని ఆశ్రయించాల్సిన పరిస్థితి.. తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గర్భిణికి డోలీమోత తప్పలేదు.. అనంతగిరి మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి డోలీలో తరలించిన సంఘటన చోటుచేసుకుంది.

Read Also: Bangladesh: హైదరాబాద్‌లోకి భారీగా చొరబడ్డ బంగ్లాదేశ్‌ వాసులు.. 20 మంది అరెస్ట్!

చింతలపాలెం గ్రామానికి చెందిన కొర్రా జానకి నిండు గర్భిణీ.. ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. అయితే, గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను డోలీలో ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. చింతలపాలెం నుంచి సుమారు కిలోమీటరు మేర డోలీపై తీసుకువచ్చారు. బూసిపుట్టు సమీపంలోకి వచ్చేసరికి పూర్తిగా దారిలేకపోవడం, వర్షాలకు కొండవాలును ఆనుకుని వరద నీరు ప్రవహించడంతో సుమారు కిలోమీటరు మేర నిండు గర్భిణిని నడిపించాల్సి వచ్చింది. అక్కడ నుంచి కొండిభకోట వరకు నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకువచ్చి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను అతి కష్టం మీద దాటించారు. అక్కడ నుంచి కొంతదూరం మోసుకు వచ్చి రేగుళ్లపాలెం మెయిన్‌రోడ్డు నుంచి ఫీడర్‌ అంబులెన్స్‌ ద్వారా ఆమెను ఆస్పత్రికి తరలించారు. రహదారి లేక అష్టకష్టాలు పడుతున్నామని, ఇప్పటికైనా రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తు్న్నారు..

Exit mobile version