Agency Bandh: బోయ వాల్మీకి, బెంతు ఒరియాలకు ఎస్టీహోదా ఇప్పుడు చిచ్చు రేపుతోంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీయేతర రాజకీయ పార్టీలు ఈ ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరోవైపు, మావోయిస్టు ఈ పరిణామాలపై లేఖ విడుదల చేశారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేష్ పేరుతో వచ్చిన ఈ లేఖలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించింది. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అధికారపార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పుకొట్టాలని పిలుపు నిచ్చింది.
మరోవైపు, ప్రభుత్వం తీర్మానం మేరకు రిజర్వేషన్లు అమలులోకి వస్తే తాము అన్ని విధాలుగా నష్టపోతామనే ఆదివాసీల భయం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్ల కోటాకు గండిపడు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ర్యాలీలు, సాంప్రదాయ ఆయుధాలతో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇక, ఎమ్మెల్యేలు, ప్ర జాప్రతినిధులకు సెగ మొదలైంది. అసెంబ్లీలో తీర్మానంను వ్యతిరేకించనందుకు బాధ్యత వహించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 5,6 షెడ్యూల్లు, 1/70కింద వచ్చిన హక్కుల పరిక్షణకు కట్టుబడాలని పట్టుబడుతున్నారు. ఆదివాసీ సంఘాల బంద్ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు పార్టీ కదలికలపై నిఘా పెంచింది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెక్యూరిటీని పెంచడంతో పాటు తీవ్రత ఎక్కువగా వున్న చోట్ల జాగ్రత్తలు పాటించాలనే సూచనలు జారీ అయ్యాయి.