ఏపీలో మంత్రివర్గంలో శాఖలు మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. మంత్రివర్గంలో శాఖలు మారుస్తారన్న సమాచారం తమకు లేదని వివరణ ఇచ్చారు. తనకు అప్పగించిన మున్సిపల్ శాఖ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షలు కూడా ప్రారంభించామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. వారి కుటుంబంలో జరుగుతున్న వివాహ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు.
ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ ఫోటోతో తాము ఎన్నికల్లో గెలిచామని.. మంత్రి పదవికి రాజీనామా చేసి తామంతా కేబినెట్ మీటింగ్ నుంచి సంతోషంగా బయటకు వచ్చామని తెలిపారు. పాత, కొత్త కలయికతో సీఎం జగన్ మంత్రి వర్గం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మంత్రి పదవి రాకపోవడంతో బాధపడిన వాళ్లంతా ప్రస్తుతం సర్థుకున్నారన్నారు. కొత్త మంత్రులు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు ఒక జెండా, ఒక అజెండా, ఒక సిద్ధాంతం ఉంటాయని.. కానీ మరొకరి పల్లకి మోయడం పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు చేశారు. ఆయనకు ఓ జెండా, ఓ అజెండా లేవని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కావాలనే తమ పార్టీపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
