దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో కీలక పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ మేరకు జగన్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎంవోయూలను కుదుర్చుకుంటున్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ కోసం భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు రూ.60 వేల కోట్లు భారీ పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది.
ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన మేరకు ఏపీలో అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. దీంతో పాటు 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ కంపెనీల ద్వారా దాదాపు 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల కోసం దావోస్ వేదికగా సీఎం జగన్ సమక్షంలో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ ఆదానీ ఎంవోయూపై సంతకాలు చేశారు.