Site icon NTV Telugu

Actor Ali: యాక్టర్‌ అలీకి త్వరలో రాజ్యసభ సీటు..?

వైసీపీ నేత యాక్టర్‌ అలీకి సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలోనే యాక్టర్‌ అలీకి రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలీతో మరోవారంలో కలుద్దామని సీఎం జగన్‌ అన్నారు. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల్లో ఒక స్థానం మైనార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మైనార్టీ స్థానం ఇప్పుడు అలీని వరించనున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి, దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్‌ కొరటాల శివలతో పాటు అలీ ఈరోజు సీఎం జగన్‌, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా టికెట్ల ధరలపై భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా వైసీపీలో ఎప్పటినుంచో ఉంటున్న అలీని సీఎం జగన్‌ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారం రోజుల్లో కలుద్దామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. నేడు భేటీ అనంతరం మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నామని ఆయన అన్నారు. చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం తెలిపారని, సీఎం తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కన్పిస్తామని చెప్పారన్నారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారికి చెప్పడం జరిగిందన్నారు.

Exit mobile version