A farmer died due to over speeding of the train: మరణం అనేది రాసిపెట్టి ఉంటె మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పించుకోలేరు అంటారు పెద్దలు. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఆడుతూ పాడుతూ ఆ క్షణం వరకు మన ముందు తిరిగిన మనుషులు కూడా మరు నిమిషంలో చనిపోయిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనే ఒకటి విజయనగరంలో చోటు చేసుకుంది. ఎప్పటిలానే పొలానికి వెళ్తున్న ఆ రైతుకు మృత్యువు రైలు రూపంలో ఎదురైనది . వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లోని పాతపెంట గ్రామానికి చెందిన గుల్ల తిరపతి అనే వ్యక్తి రైలు పట్టాల పక్కన ఉన్న తన పొలానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ రైలు పట్టాల మీదకు వచ్చింది. అయితే రైలు వెతున్న వేగానికి వీచిన గాలికి ఆ రైతు ఎగిరి దూరంగా పడ్డాడు.
Read also:plane crash : ప్రమాదానికి గురైన విమానం.. నలుగురు మృతి
దీనితో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న చందాన కార్తీక్ అనే గ్రామస్తుడు ఆ రైతు పడిపోవడం గమనించాడు. వెంటనే రైతు కుమారునికి ఈ సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న రైతు కుమారుడు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని కార్తీక్ సహాయంతో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా అప్పటికే ఆ రైతు మృతి చెందారని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మరణించిన రైతుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రైతు మరణంతో స్థానికంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి.