A Man Manikanta Commits Suicide Due To Loan App Harassment In Vijayawada: పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. లోన్ యాప్ వేధింపులు ఆగడం లేదు. బాధితులను నిర్వాహకులు రకరకాలుగా టార్చర్ పెడుతూనే ఉన్నారు. బూతులు తిట్టడమే కాకుండా, న్యూడ్ ఫోటోలు వైరల్ చేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేకే రీసెంట్‌గా మణికంఠ (33) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలో పాల వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్న ఇతను, ఆర్థిక అవసరాల నిమిత్తం లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నాడు. అయితే.. రుణం సరిగ్గా కట్టకపోవడంతో అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. దీంతో, మనస్తాపానికి గురైన మణికంఠ, ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
మణికంఠ భార్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 306 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కొన్ని షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. మణికంఠ సుమారు 30 యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నట్టు గుర్తించారు. లోన్ యాప్స్ నిర్వాహకులు అతనికి న్యూడ్ ఫోటోలను సైతం పంపించారు. ఆ ఫోటోలను సోసల్ మీడియాలో పెడతామని లోన్ యాప్స్ నిర్వాహకులు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపారు. ఆ చాటింగ్ సేకరించిన పోలీసులు.. మణికంఠ ఫోన్ సీజ్ చేశారు. నిందితుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు.. లోన్‌యాప్‌ల నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే భయాందోళన చెందకుండా బాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలని, ఆగడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సూచిస్తున్నారు. లోన్‌యాప్ ఆగడాలపై ఫిర్యాదుకు 1930 ఫోన్ నంబర్‌తో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను వినియోగించుకోవాలని కోరారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ లోన్‌యాప్ ఆగడాలను భరించలేక ఆరుగురు బలవన్మరణం చెందారు. లోన్‌యాప్ ఆగడాలపై రాష్ట్రంలో ఇప్పటిదాకా 75 కేసులు నమోదు కాగా.. 71 మందిని అరెస్ట్ చేశారు. 207 ఫేక్‌లోన్ యాప్‌లను గుర్తించి, వాటిలో 173 యాప్‌లను అధికారులు నిషేధించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి ఈ యాప్‌లు ఆపరేట్ అవుతున్నాయని పేర్కొన్నారు. లోన్‌యాప్ ఆగడాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.