Vishakapatnam: విశాఖపట్నం నగర శివారులోని గాజువాకలో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహానికి ముప్పు పొంచి ఉంది. 89 అడుగుల గణేష్ విగ్రహం కూలిపోతుందేమోనని స్థానిక పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ భారీ వినాయకుడి మట్టి విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. దీంతో తనిఖీలు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను పోలీసులు కోరారు. తనిఖీ చేసిన ఆర్ అండ్ బీ అధికారులు ఈ భారీ విగ్రహం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని నివేదిక ఇచ్చారు. దీంతో వెంటనే నిమజ్జనం చేయాల్సిందిగా పోలీసులు సూచించారు. ఏ క్షణం అయినా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పడంతో విగ్రహం 100 మీటర్ల లోపు ఎవరినీ లోపలకు అనుమతించడం లేదు.
Read Also: Ganesh Laddu Rs. 46 lakh: బాలాపూర్ గణేష్ రికార్డు బ్రేక్.. రూ.46 లక్షలు పలికిన గణపతి లడ్డూ..
అయితే 89 అడుగుల భారీ వినాయకుడి విగ్రహాన్ని ఈనెల 18వ తేదీ నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. దీంతో ముందస్తు నిమజ్జనానికి ఉత్సవ కమిటీ అధికారులు ససేమిరా అంటున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహం తడిసి కూలిపోయే ప్రమాదం ఉందని ఆర్ అండ్ బీ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన 89 అడుగుల విగ్రహాన్ని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. రోజూ వేలాదిమంది దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం కావడంతో పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. కాగా పోలీసుల ఆదేశాల మేరకు దర్శనాలను నిలిపివేసిన నిర్వాహకులు ఈనెల 12న వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
